For English – Click here
శ్రీ కాంచీ పుర నిలయ కామాక్షీ అమ్మవారి దండకం – బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారి రచన
- సకల జనని! తే నమః. కాంచి సంవాసి! భూతేశ భావానుకూలే!
- భవార్ణోనిధేర్ భీతభీతాన్ సముత్తారయన్తీ!
- సదైకామ్ర సాలస్య మూలే వసన్తీ! తపస్యన్తి!
- చిత్తోద్భవారాతి చిత్తస్య శాంతేః ప్రదాత్రీ!
- సుగాత్రీ! వినేత్రీ! సురారాతి వర్గస్య దాత్రీ!
- ముముక్షోర్ జనస్యాపవర్గస్య సర్గస్య భావస్య సంహార కార్యస్య కర్త్రీ!
- విధాత్రాది గీర్వాణ వర్గస్య రక్షా భవిత్రీ!
- స్వపాదాంబుజారాధనాసక్త చిత్తస్య దౌర్గత్య హన్త్రీ!
- భవత్యేవ దేవీతి నైరంతరేణాంతరే భావయంతం నమస్యంత మంతే వసన్తం
- మహాదేవి! కామాక్షి!
- సత్కర్మణాం సాక్షిణీ త్వం సదా వర్తసే. భర్తృ సేవా రతానాం సతీనాం భవత్యేవ ప్రాథమ్యమాపద్యసే.
- యస్స్మరేత్త్వాం సదారుణ్య భాసా విభాంతీం ద్రుతం హృద్య భావాంచితా భారతీ తస్య చాస్యా ద్వినిర్యాతి
- చిత్రం కిమత్రేతి సంభావయంతం ముదా మాం విలోక్యావితుం
- సేవితుం త్వాం మహాభాగ్య మాధాతు మభ్యర్థయే.
- వారణాస్యస్య స్కందస్య చాంబే !అఖిలాంబే! మదంబే !నమస్తే. నమస్తే. నమః.
తెలుగు అర్థం – Dr. పాతూరి నాగరాజు
- అందరి/అన్నిటి కన్నతల్లీ! నీకు నమస్కారం. కాంచీపురంలో ఉండే దానా! భూతనాయకుడయిన శివుడి ఆలోచనలకు/ మనసుకు అనుగుణంగా నడచుకునే దానా!
- సంసార సముద్రంలో తీవ్రంగా భయపడి ఉన్నవారిని (ఆ సముద్రం నుంచీ/ ఆ స్థితి నుంచీ ) చక్కగా అవతలికి దాటించే దానా!
- ఎల్లప్పుడూ (కాంచీపురంలోని) ఏకామ్రవృక్షమనే మామిడి చెట్టు వేళ్ల దగ్గర నివసించేదానా! (అలా నివసిస్తూ అక్కడ ) తపస్సుచేస్తూ ఉండేదానా!
- మన్మథుడి శత్రువుకు (అంటే కామదహనం చేసిన శివుడికి) ( ఆ కామదహన సమయపు కోపాన్ని శమింపజేసి )మనశ్శాంతిని ఇవ్వగలిగేదానా!
- చక్కని శరీరాకృతి కలదానా! వినయము కలదానా! దేవతల శత్రువులను (రాక్షసులను) గడ్డి కోసినట్లు సంహరించేదానా!
- మోక్షమును కోరి దానికై కృషి చేసే వారికి మరణము, దానివలన పునర్జన్మలనే మాటే లేకుండగ ఆ చక్రమును సంహరించే దానా!
- బ్రహ్మాది దేవతలందరికి రక్ష అయిన దానా!
- నీ పాదపద్మాలను ఆరాధించే ఆసక్తి గలవారికి ఉన్న దుర్గతిని/కష్టాలను పోగొట్టే దానా!
- దేవివంటే నీవేనని నిరంతరంగా మనసులో భావిస్తూ నీకు నమస్కరిస్తూ నీ పాదాల దగ్గర నివసిస్తూ
- ఓ పెద్ద దేవీ! కామాక్షీ దేవీ!
- మంచి కర్మలన్నింటికీ నీవు ఎల్లప్పుడూ సాక్షిగా నిలుస్తూ ఉంటావనీ భర్త సేవలో ఇష్టంతో మునిగి ఉండే పతివ్రతలలో నీదే మొదటి స్థానమని
- ఎల్లప్పుడూ ఎర్రని కాంతితో ప్రకాశించే నిన్ను ఎవరైతే స్మరిస్తారో అటువంటివారి నోటి నుండి రమణీయ భావాలతో అందగించే కవిత్వం వడిగా వెలువడుతుంది
- ఇందులో వింత ఏముంది అని భావిస్తూ ఉండే నన్ను సంతోషంతో చూసుకొమ్మని (కాపాడమని)
- నిన్ను సేవించే మహాభాగ్యం ప్రసాదించమని వేడుకొంటున్నాను.
- గజముఖుడయిన గణపతికీ, సుబ్రహ్మణ్యస్వామికీ (ఆ మాటకువస్తే) అందరికీ తల్లీ! నా తల్లీ! నీకు నమస్కారం. నీకు నమస్కారం (అమ్మా) నమస్కారం.