For English – Click here
స్తోత్ర పరిచయం మరియు తెలుగు అర్థం పొందుపరచింది – Dr. పాతూరి నాగరాజు
ఈ స్తోత్రం విషయంలో కొంత వివరణ అవసరం. కాత్యాయన వరరుచి పాణినీయ వ్యాకరణ సంప్రదాయపు మునిత్రయంలో ఒకరు. ఈ స్తోత్రంలో పదే పదే ప్రస్తావించ బడుతున్న పుష్పదంతుడేమో ఎంతో ప్రాచుర్యం ఉన్న శివమహిమ్న స్తవపు రచయితగా ప్రసిద్ధుడు. కీ. శే. శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారు ఈ ఇరువురు వేరు వేరు వ్యక్తులు కారని కాత్యాయన వరరుచే పుష్పదంతుడని తొలి సారిగా గుర్తించి ఎన్నో సాక్ష్యాలతోనూ వాదనలతోనూ తాను శ్రీ శివ మహిమ్న స్తవానికి వ్యాఖ్యానంగా రాసిన గ్రంథంలో ఋజువు చేశారు.ఆ వ్యాఖ్యాన గ్రంథ ప్రారంభంగా శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారు రచించిన శ్లోకాలే ఇవి.
1. కత గోత్ర మహాంభోధి – రాకా పూర్ణ నిశాకరం
పుష్పదంత మహం వందే – నామ్నా వరరుచిం మునిం
అర్థం:’కత’ అనే మహర్షి గోత్రం (వంశం) అనే మహా సముద్రంలో ఉదయించిన నిండు పున్నమి చంద్రుడు అయిన వరరుచి మునికి పుష్పదంతుడనే పేరుగలవానిగా (ఆయనను గ్రహించి) నేను నమస్కరిస్తున్నాను.
2. నమో వరరుచే తుభ్యం – సర్వాగమవిశారద
పాణినీయమహంభోధి – కర్ణధారాయ సూరయే
అర్థం: ఓ వరరుచీ! సకల వైదిక శాస్త్రాల లో నిష్ణాతుడా! పాణిని మహర్షిచే అందించ బడిన ‘అష్టాధ్యాయీ’ కరణమనే మహాసముద్రాన్ని (మా బోటి వారు దాటడంలో ) ఓడ సరంగు వలె ఉపయోగపడే మేధాసంపన్నుడా! నీకు నమస్కారం.
3.శబ్ద శాస్త్ర పయోవార్ధేః – ప్రతిభా యస్య మందరః
కాత్యాయనమునిం వందే – మాన్యం వరరుచిం హృదా
అర్థం: భాషాధ్యయన శాస్త్రం (వ్యాకరణ శాస్త్రం) అనే పాలసముద్రాన్ని మథించడంలో ఎవరి ప్రతిభ మందర పర్వతమంత సమర్థమైనదో ఆ కాత్యాయన ముని అయిన పూజ్యుడయిన వరరుచికి మనసారా నమస్కరిస్తున్నాను.
4. శివ తత్త్వ మిదం స్తోత్రం – మహిమ్నః పదపూర్వకం
యో కరో త్తం వరరుచిం – పుష్పదంతం నమా మ్యహం
అర్థం: మహిమ్నః అనే పదముతో కూడిన పేరుగల ఈ స్తోత్రం (‘శివ మహిమ్నః స్తవం’) శివ తత్త్వమే ( శివ తత్త్వాన్ని
తెలియజేయడమే లక్ష్యంగా/లక్షణంగా గలది). అటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరు రచించారో ఆ వరరుచికి, (అనగా) పుష్పదంతుడికి నేను నమస్కరిస్తున్నాను.
5. భాష్యార్థ భాషణే యస్య – వాక్ఛ్రుతేః సర్వధా సమా
నమామి పుష్పదంతం తం – శాబ్దికం హరవందినం
అర్థం: (అష్టాధ్యాయీ సూత్రాలకు పతంజలి మహర్షి రచించిన) మహా భాష్యానికి అర్థం చెప్పడంలో ఎవరిమాట అన్నివిధాలుగానూ వేదంతో సమానం (గా ప్రామాణికం) అయినదో అటువంటి శబ్దశాస్త్రవేత్తా శివుడి వందీ (స్తోత్రపాఠకుడూ) కూడా అయిన పుష్పదంతుడికి నమస్కరిస్తున్నాను.
6. సిద్ధప్రమ్యం పుష్పదంతం – కాత్యం వరరుచిం మునిం
శివ వంది గణశ్రేష్ఠం – నమామి కరణై స్త్రిభిః
అర్థం: శివుడి వంది (స్తోత్రపాఠక) గణాలలో శ్రేష్ఠుడయిన పుష్పదంతుడూ (ఆ కారణంగా ) జన్మసిద్ధ జ్ఞానస్ఫూర్తి కలవాడూ అయిన కతగోత్రోద్భవుడయిన వరరుచి మునికి త్రికరణాలతోనూ (మనసుతొనూ, వాక్కులతోనూ అంగములతోనూ) నమస్కరిస్తున్నాను.
7. అనుగ్రహేన కాత్యస్య – యథాశక్తి నిరుచ్యతే
సీతారామంజనేయేన – శైవోయం మహిమస్తవః
అర్థం: కతగోత్రోద్భవుని ( వరరుచిముని ) అనుగ్రహంతో సీతారామాంజనేయులు చేత శివ సంబంధమైన ఈ ‘మహిమస్తవము’ యథా శక్తిగా అర్థవివరణ చేయబడుతున్నది. (వ్యాఖ్యానించబడుతున్నది).
8. అనుగృహ్ణాతు భగవన్ – మహాదేవో జగద్గురుః
అనుగృహ్ణంతు గురవః – సంతశ్చేమం జనం హృదా
అర్థం: జగద్గురువు ( లోకానికంతటికీ) గురువయిన భగవాన్ మహదేవుడు అనగా శివ భగవానుడు ఈ మనిషిని (సీతారామాంజనేయులును) మనసా అనుగ్రహించును గాక. గురువులూ సత్పురుషులూ కూడా ఈ మనిషిని (సీతారామాంజనేయులును) మనసా అనుగ్రహించెదరు గాక.
– శ్రీ పాతూరి సీతారామాంజనేయులు